సబ్జెక్టు చెప్పేవారు లేరు

ఒంగోలు టౌన్‌: గత ఏడాది సాధించిన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు అనేక మంది తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. దాంతో ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సమయంలో సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే మోకాలొడ్డింది. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించింది. ఎంతో ఆశతో తమ పిల్లలను ప్రభుత్వ రెండు నెలలు దాటడంతో తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించే అవకాశం లేక విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం సందిగ్ధంలో పడేసింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల షార్ట్, పాఠ్య పుస్తకాలు లేట్‌గా రావడంతో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులకే అసలైన పరీక్షా కాలం వచ్చినట్లయింది. మరికొన్ని రోజుల్లో సమ్మెటివ్‌–1 పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సగం సిలబస్‌తో ఆ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు సమ్మెటివ్‌–1కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం విశేషం.

డీఎస్సీ డ్రామా.. 
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులన్నీ భర్తీ చేస్తానంటూ నిరుద్యోగ అభ్యర్థులకు వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. డీఎస్సీకి  సంబంధిత మంత్రితో ప్రకటన చేయించడం, నోటిఫికేషన్‌ జారీ చేసిన తరువాత ఏదో ఒక కొర్రీ వేసి దానికి బ్రేక్‌లు వేయడం పరిపాటిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు ఏడాదికేడాది పెరిగిపోతూనే ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్, ల్యాంగ్వేజి పండిట్, పీఈటీలకు సంబంధించి మొత్తం 12,655 పోస్టులు ఉన్నాయి.
వీటిలో 810కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి తెలుగు సబ్జెక్టులో 291 పోస్టులు, హిందీ సబ్జెక్టులో 220 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌జీటీలకు సంబంధించి తెలుగు సబ్జెక్టులో 184 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సోషల్‌ స్టడీస్‌లో 37 పోస్టులు, బయోలాజికల్‌ సైన్స్‌లో 21 పోస్టులు, మ్యాథ్స్‌కు 14 పోస్టులు, ఇంగ్లిష్‌కు 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో పదుల సంఖ్యలో ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయలు ఉద్యోగ విరమణ చేశారు. దాంతో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం పనిచేసే ఉపాధ్యాయులపై అదనపు భారం పడింది.

Comments